Uttar Pradesh: అత్యాచార బాధితురాలైన లా విద్యార్థినికి షాక్.. పరీక్షలకు అనుమతి నిరాకరించిన వర్సిటీ!

  • పోలీసు భద్రతతో వర్సిటీకి చేరుకున్న విద్యార్థిని
  • హాజరు తక్కువగా ఉందని నిరాకరణ
  • న్యాయపోరాటం చేస్తానన్న లా విద్యార్థిని

అత్యాచార బాధితురాలైన లా విద్యార్థినికి ఉత్తరప్రదేశ్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే రోహిల్‌కుండ్ విశ్వవిద్యాలయం షాకిచ్చింది. కోర్టు అనుమతితో పోలీసుల భద్రత మధ్య పరీక్షలు రాసేందుకు యూనివర్సిటీకి వచ్చిన ఆమెను అధికారులు అడ్డుకున్నారు. పరీక్ష రాసేందుకు అనుమతి లేదని చెప్పడంతో ఆమె షాకైంది.

మూడో ఏడాది చదువుతున్న ఆమె తరగతులకు సరిగా హాజరు కావడం లేదని చెబుతూ సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. పరీక్షలు రాసేందుకు అవసరమైన 75 శాతం హాజరు లేదని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ అనిల్ శుక్లా తెలిపారు. వర్సిటీ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని పేర్కొన్నారు.

లా విద్యార్థినిపై అత్యాచారం కేసులో బీజేపీ నేత చిన్మయానంద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, డబ్బుల కోసం తనను బెదిరించిందంటూ బాధిత విద్యార్థినిపై చిన్మయానంద తిరిగి కేసు పెట్టారు. ఈ కేసులో ప్రస్తుతం ఆమె జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తనను పరీక్షలకు అనుమతించకపోవడంపై విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తానని తెలిపింది.

More Telugu News