Andhra Pradesh: వాస్తవాలను దాచిపెట్టారంటూ.. ఐదుగురు రైతులకు ఏపీ హైకోర్టు భారీ జరిమానా!

  • కర్నూలు జిల్లాలో మైనింగ్ కేసు
  • ఒక్కొక్కరికీ రూ. లక్ష జరిమానా
  • రెండు వారాల్లో కట్టకుంటే రెవెన్యూ చట్టం ప్రయోగించాలని ఆదేశం

కోర్టు ముందు వాస్తవాలను దాచి పెట్టారని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేసి, హైకోర్టు విలువైన సమయాన్ని వృథా చేశారని ఆరోపిస్తూ, కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు రైతులకు ఏపీ హైకోర్టు రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది.

తాము చిన్న రైతులమని, జరిమానా తగ్గించాలని వారు మొరపెట్టుకోగా, చేసింది పెద్ద తప్పంటూ, జరిమానా తగ్గించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌ లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. రెండు వారాల్లో జరిమానా చెల్లించాలని, లేకుంటే, రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించాలని ఆదేశించింది.

కేసు వివరాల్లోకి వెళితే, కర్నూలు జిల్లాలో ప్రమీల అనే మహిళ మైనింగ్ లీజును పొందగా, ఆపై స్థానిక తహసీల్దార్, నిరభ్యంతర పత్రాన్ని ఉపసంహరించుకోవడంతో, గనుల్లో తవ్వకాలను ఆపేశారు. దీనిపై కోర్టుకు వెళ్లిన ప్రమీల, సానుకూల ఉత్తర్వులను పొందగా, ఆ విషయాన్ని దాచిపెట్టి, 2011లో కోర్టును ఆశ్రయించిన ఎం రమణారెడ్డి, మరో ఐదుగురు రైతులు మైనింగ్ పై మళ్లీ స్టే తెచ్చారు.

అప్పటి నుంచి వాద, ప్రతివాదుల మధ్య కేసు నడుస్తూనే ఉంది. తాజాగా సీజే ముందుకు కేసు రాగా, రైతుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసులో రైతులను పోలీసులు నిన్న కోర్టు ముందు హాజరు పరచగా, రికార్డులన్నీ పరిశీలించిన ధర్మాసనం, వీరు నిజాన్ని దాచారని, న్యాయవాదిని బెదిరించారని తేల్చింది. పిటిషన్ వేసిన ఆరుగురిలో ఒకరు మరణించడంతో మిగతా వారికి జరిమానా విధిస్తున్నట్టు తీర్పిచ్చింది.

More Telugu News