Andhra Pradesh: స్పీకర్ గా ఉన్న వ్యక్తి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదు: తమ్మినేనిపై టీడీపీ నేత కూన రవికుమార్

  • తమ్మినేని సీతారాం ఉపయోగించిన భాషను దేశంలో ఏ స్పీకర్ వాడలేదు
  • స్పీకర్ గా ఉన్న వ్యక్తి గౌరవంగా సంబోధించాల్సి ఉంటుంది  
  • ఆయన తప్పులను ఎండగడతా.. అది నా బాధ్యత

నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అలవాటేనని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. తమ్మినేని వాడిన భాషను దేశంలోని ఏ స్పీకర్ కూడా వాడలేదని ఆయన ధ్వజమెత్తారు. తమ్మినేని సీతారాంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి అచ్చెంనాయుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ లకు అసెంబ్లీ కార్యదర్శి నుంచి ప్రివిలెజ్ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూన రవికుమార్ మీడియాతో మాట్లాడారు.

తమ్మినేని సీతారాం రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నెరవేర్చలేక కాలరాస్తున్నారని.. బాధ్యతగల పౌరుడిగా తాను స్పందించానని రవికుమార్ చెప్పారు. ‘స్పీకర్ గా ఉన్న వ్యక్తి గౌరవంగా సంబోధించాల్సి ఉంటుంది. సీతారాం అది మరిచారు. మా అధినేతపై, పార్టీ నేతలపై అక్కసుతో, రాక్షసంగా విమర్శించారు. కిరాతక భాషను ఉపయోగిస్తూ దూషించారు. ఆయన విమర్శలను తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఉందనే మేము స్పందించాము.

మేము స్పీకర్ నుద్దేశించి మాట్లాడటంలేదు. తమ్మినేని సీతారాం గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే సీతారాం చెబుతుంటారు. అసెంబ్లీ లోపలే తాను స్పీకర్ ను, బయటకు వెళితే నేను తమ్మినేని సీతారాంనని... కాబట్టి నేను అసెంబ్లీ కొచ్చి మాట్లాడలేదు. బయటే మాట్లాడాను. ఆయన మీడియా ముందు మాట్లాడారు, నేనూ మీడియా ముందే మాట్లాడాను. తమ్మినేని సీతారాం తప్పులను ఎండగడతా.. ఇది నా బాధ్యత’ అని అన్నారు.

More Telugu News