Thulasi Reddy: అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం హర్షణీయం: తులసిరెడ్డి

  • బొత్స వ్యాఖ్యలతో అమరావతితో భయాందోళనలు నెలకొన్నాయి
  • రాజధాని పనులను కొనసాగించాలనే ప్రభుత్వ నిర్ణయం సంతోషకరం
  • రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలి

ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని, రాజధాని ప్రాంతాల్లో నిర్మాణాలను ఆపకుండా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఇది రాజధాని కోసం భూములిచ్చిన రైతుల, రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాల, మీడియా విజయమని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో అమరావతిపై భయాందోళనలు నెలకొన్న మాట వాస్తవమని అన్నారు.

దీనికి తోడు అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ ప్రాజెక్టు నుంచి సింగపూర్ తప్పుకోవడం, దానిపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టతను ఇవ్వకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజధాని పనులపై జగన్ సమీక్ష నిర్వహించడం, ఇప్పటికే చేపట్టిన పనులను కొనసాగించాలని నిర్ణయించడం హర్షణీయమని తెలిపారు.

ఏపీకి రాజధాని, హైకోర్టు రెండు కళ్లవంటివని తులసిరెడ్డి చెప్పారు. వీటిలో ఒకదాన్ని కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేస్తే, మరొకదాన్ని రాయసీమలో ఏర్పాటు చేయాలనే విషయాన్ని శ్రీబాగ్ ఒప్పందం స్పష్టంగా చెబుతోందని గుర్తు చేశారు. రాజధానిని కోస్తాలో కొనసాగించాలని నిర్ణయించిన నేపథ్యంలో, హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయడం సమంజసమని చెప్పారు.

గుజరాత్, కేరళ, ఉత్తరప్రదేశ్ సహా 11 రాష్ట్రాల్లో రాజధాని, హైకోర్టులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు. హైకోర్టును రాయలసీమలో, హైకోర్టు బెంచ్ లను అమరావతి, విశాఖపట్నంలలో ఏర్పాటు చేయడం మంచిదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇద్దరూ రాయలసీమ వాసులై ఉండి ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం బాధాకరమని అన్నారు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని చంద్రబాబు బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News