Maharashtra: హోటల్ కు చేరిన మూడు పార్టీల ఎమ్మెల్యేలు!

  • గ్రాండ్ హయత్ హోటల్లో సంఖ్యా బలం చాటిన కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన
  • 162 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెపుతున్న నేతలు
  • గవర్నర్ జీ.. మా బలాన్ని చూడండి అంటూ ట్వీట్లు

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటును నిరసిస్తున్న కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి తమకు మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలతో కలిసి తమ సంఖ్యా బలాన్ని మీడియా ఎదుట ప్రదర్శించింది. ఈ మూడు పార్టీల నేతలు తమ ఎమ్మెల్యేలతో సహా స్వతంత్ర, చిన్నపార్టీల ఎమ్మెల్యేలతో కలిసి మొత్తం 162 మంది ఎమ్మెల్యేలను మీడియా ముందుకు తీసుకొచ్చారు. వారి నందరినీ ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ కు చేర్చి తమ బలాన్ని ప్రదర్శించాయి.

ఈ పరేడ్ ను గవర్నర్ చూస్తారని తాము ఆశిస్తున్నట్లు శివసేన నేతలు పేర్కొన్నారు. ‘గవర్నర్ సాబ్, మా వద్ద 162 మంది ఎమ్మెల్యేల బలం ఉంది చూడండి’ అని ఇప్పటికే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గవర్నర్ కు ట్వీట్ చేశారు. కాగా, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే కూడా ఇదే రీతిలో స్పందించారు. మరోవైపు తమకు 162 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చాటుతూ, హోటల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హోటల్ వద్దకు చేరుకున్న ప్రముఖుల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరాట్, శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, ఆయన తనయుడు ఆదిత్య థాకరే, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తదితర నేతలు ఉన్నారు.

More Telugu News