హాయ్ అజార్... ఇది మనిద్దరి కన్నా పెద్ద విషయం... పర్సనల్ గా తీసుకోవద్దు: అంబటి రాయుడు

24-11-2019 Sun 20:30
  • హెచ్ సీఏలో అవినీతి అంటూ రాయుడు కలకలం
  • స్పందించిన అజహరుద్దీన్
  • రాయుడు ఓ అసహన క్రికెటర్ అంటూ వ్యాఖ్య
  • తన ట్వీట్ పై వివరణ ఇచ్చిన రాయుడు

హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ)లో దారుణమైన రీతిలో అవినీతి రాజ్యమేలుతోందని, భావితరాల క్రికెటర్లు బాగుపడాలంటే మీరు తప్పక జోక్యం చేసుకోవాలంటూ క్రికెటర్ అంబటి రాయుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ట్వీట్ చేయడం తెలిసిందే. దీనిపై హెచ్ సీఏ ప్రస్తుత అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ స్పందిస్తూ రాయుడ్ని అసహన క్రికెటర్ గా పేర్కొన్నారు. దీనికి రాయుడు తాజాగా ట్విట్టర్ లో బదులిచ్చాడు.

"హాయ్ అజార్, ఇది మనిద్దరి కంటే పెద్ద విషయం. దయచేసి వ్యక్తిగతంగా తీసుకోవద్దు. హెచ్ సీఏలో ఏం జరుగుతోందో మనిద్దరికీ తెలుసు. హెచ్ సీఏని ప్రక్షాళన చేసేందుకు మీ ముందు అద్భుత అవకాశం నిలిచి ఉంది. కొందరు ధూర్తుల నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి. తద్వారా భావితరాల క్రికెటర్లకు మేలు చేసిన వారవుతారు" అంటూ రాయుడు ట్వీట్ చేశాడు.