Supreme Court: ఇలాంటి పిటిషన్ ను నేనింతవరకు చూడలేదు: బీజేపీ తరఫు న్యాయవాది ముకుల్ రోహాత్గీ

  • మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ
  • హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టును ఎలా ఆశ్రయిస్తారన్న రోహాత్గీ

మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ, ఇతర ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపించారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ దాఖలు చేసిన పిటిషన్ పై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి పిటిషన్ ను తన కెరీర్ లో ఇప్పటివరకు చూడలేదని వ్యాఖ్యానించారు. గవర్నర్ కు రాజ్యాంగబద్ధంగా ప్రాప్తించిన విచక్షణ అధికారాలను ఎలా ప్రశ్నిస్తారని నిలదీశారు.

మూడు వారాల పాటు నిద్రపోయిన ఇప్పుడొచ్చి అకస్మాత్తుగా బలనిరూపణ చేయాలంటున్నారని విమర్శించారు. ఓవైపు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటైందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం విచారణ జరపడం సబబు కాదని అన్నారు. అంతేకాకుండా, పార్టీలు హైకోర్టును కాకుండా సుప్రీంకోర్టును నేరుగా ఎలా ఆశ్రయిస్తాయని ప్రశ్నించారు.

More Telugu News