Hyderabad: భార్య వివాహేతర సంబంధం.. విదేశాల నుంచి వచ్చి భర్త నిఘా.. అర్ధరాత్రి తలుపుకొట్టిన భర్తకు మరో షాక్!

  • ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు భర్త
  • చిన్న నాటి స్నేహితుడితో భార్య వివాహేతర సంబంధం
  • రహస్యంగా నగరానికి చేరుకుని భార్యపై నిఘా

వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు విదేశాల నుంచి వచ్చిన భర్త.. అర్ధరాత్రి ఇంటికెళ్లి తలుపుకొట్టాడు. అక్కడ కనిపించిన మరో దృశ్యం అతడిని దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా నడిగూడేనికి చెందిన వ్యక్తికి అదే జిల్లాకు చెందిన యువతితో పదేళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకే హైదరాబాద్ వచ్చి కొత్తపేటలోని వాసవీకాలనీలో సొంత ఫ్లాట్ కొనుక్కుని కాపురం పెట్టారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన భర్త ఎంఎస్ చదివేందుకు ఆరేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్లేవాడు.

భర్త దూరంగా ఉండడంతో భార్య తన చిన్ననాటి స్నేహితుడైన వైద్యుడు శివప్రసాద్‌కు దగ్గరైంది. విషయం తెలిసిన భర్త.. భార్యకు ఫోన్ చేసి హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు భార్యకు తెలియకుండా 20 రోజుల క్రితం రహస్యంగా హైదరాబాద్ చేరుకుని ఆమెపై నిఘాపెట్టాడు. ఆమె తప్పించుకోకుండా దొరకాలని సమయం కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి భార్య, తన స్నేహితుడితో కలిసి ఉండగా వెళ్లి తలుపుకొట్టాడు.

తలుపు తెరిచిన భార్య నివ్వెరపోయింది. లోపలున్న శివప్రసాద్‌ను చూసి ఇక్కడ ఎందుకున్నావని భర్త ప్రశ్నించాడు. దీనికి అతడు స్పందిస్తూ.. తాను ఎప్పుడైనా వస్తానని, ఎక్కువ మాట్లాడితే చంపేస్తానని బెదిరించాడు. వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. బాధిత భర్త అప్పటికే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అదే సమయానికి అక్కడికి చేరుకుని శివప్రసాద్‌ను, బాధితుడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారితో మాట్లాడుతుండగానే అక్కడ మరో షాకింగ్ ఘటన జరిగింది. ఆ ఇంట్లోని మరో గదిలో నిందితురాలి స్నేహితులైన నరేశ్, మరో యువతి పట్టుబడ్డారు. వీరు దంపతులు కాదని, వీరు కూడా వివాహేతర సంబంధం నెరుపుతున్నారని  నిర్ధారించుకుని అందరినీ అరెస్ట్ చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News