Yanamala: రంగులకు వందల కోట్లు దుబారా చేసి పొదుపుపై నీతి వాక్యాలు చెబుతున్నారు: యనమల

  • వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి
  • గత ప్రభుత్వంపై నిందలు వేయడం చేతకానితనమన్న యనమల
  • ఏటా రూ.8 వేల కోట్లు దుబారా చేస్తున్నారని ఆరోపణ

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని ఆర్థిక దుస్థితిలోకి నెడుతున్నారని ఆరోపించారు. ఓవైపు రంగులు వేయడం కోసం వందల కోట్లు దుబారా చేస్తూ, మరోవైపు పొదుపుపై నీతి వాక్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రస్తుత పరిస్థితికి గత ప్రభుత్వంపై నిందలు వేయడం వైసీపీ చేతకానితనం అని విమర్శించారు.

4 నెలల్లో తన ఇంటి కోసం రూ.16 కోట్లు ఖర్చు చేసిన పెద్దమనిషి ఒక్క పైసా వృథా చేయొద్దని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. వలంటీర్లు, సచివాలయాల ముసుగులో ఏడాదికి రూ.8000 కోట్లు దుబారా చేస్తున్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా పోస్టులు సృష్టించి ప్రభుత్వ జీతాలు చెల్లిస్తున్నారని విమర్శించారు. సాక్షి మీడియా యాడ్ రేట్లను 200 శాతం పెంచారని ఆయన ఆరోపించారు.

More Telugu News