అమిత్ షా నమ్మినబంటు... 'మహా' రాజకీయాల్లో చక్రం తిప్పిన భూపేంద్ర యాదవ్!

23-11-2019 Sat 15:19
  • మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్
  • అజిత్ పవార్ తో చర్చలు జరిపి ఒప్పించిన భూపేంద్ర యాదవ్
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న భూపేంద్ర

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యరీతిలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఏర్పాటులో చాపకింద నీరులా వ్యవహరించిన కీలక నేత ఎంపీ భూపేంద్ర యాదవ్. రాజస్థాన్ కు చెందిన బీజేపీ నేత భూపేంద్ర యాదవ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నమ్మినబంటుగా ముద్రపడ్డారు. ప్రభుత్వ ఏర్పాటు తమ వల్ల కాదని బీజేపీ వెనక్కితగ్గడం వ్యూహాత్మకమేనని ప్రత్యర్థులు గ్రహించేలోపే సీఎం పీఠంపై ఫడ్నవీస్ చిద్విలాసం చేశారంటే అందుకు కారణం భూపేంద్ర యాదవే!

ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని పదేపదే చెబుతుంటే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆయన వ్యాఖ్యల ఆంతర్యం ఇప్పుడర్థమవుతోంది. గత కొన్నిరోజులుగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ తో భూపేంద్ర యాదవ్ రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. నిన్న రాత్రి బీజేపీ, అజిత్ పవార్ మధ్య ఒప్పందం కుదరడంలో భూపేంద్ర కీలకభూమిక వహించారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న శరద్ పవార్ అంతటివాడు కూడా ఏం జరుగుతుందో అంచనా వేసేలోపే సొంత పార్టీలో చీలిక వచ్చిందంటే భూపేంద్ర యాదవ్ ఏ స్థాయిలో చక్రం తిప్పారో అర్థం చేసుకోవచ్చు.