ajit pawar: అజిత్ పవార్ వెంట 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లారు.. గవర్నర్ ను కలుస్తాం: శరద్ పవార్

  • అన్ని పార్టీల వద్ద తమ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన పత్రాలుంటాయి
  • వాటినే తీసుకెళ్లి అజిత్ పవార్ ఇచ్చి ఉండొచ్చు
  • బీజేపీ మెజార్టీ నిరూపించుకోలేదు
  • బల నిరూపణ తర్వాత మా మూడు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి

తమ పార్టీకి ఎన్సీపీ నుంచి 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఇందుకు సంబంధించిన లేఖను ఆ పార్టీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ ఇచ్చారని బీజేపీ నేతలు చెబుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వివరణ ఇచ్చారు.

'అన్ని పార్టీల వద్ద తమ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన పత్రాలు ఉంటాయి. ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా అజిత్ పవార్ ఉన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన పత్రాలు సాధారణంగా ఆయన వద్దే ఉంటాయి. వాటినే తీసుకెళ్లి ఆయన ఇచ్చి ఉండొచ్చని నేను భావిస్తున్నాను. అజిత్ పవార్ వెంట 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లారు. ఈ విషయంపై మేము త్వరలోనే గవర్నర్ ను కలుస్తాం' అని శరద్ పవార్ తెలిపారు.

'బల నిరూపణకు గవర్నర్ వారికి అవకాశం ఇచ్చారు. అయితే, బీజేపీ మెజార్టీ నిరూపించుకోలేదని నేను కచ్చితంగా చెప్పగలను. బల నిరూపణ తర్వాత మా మూడు పార్టీలు కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి' అని శరద్ పవార్ తెలిపారు. అజిత్ పవార్ పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్యాప్తు సంస్థలకు భయపడే ఆయన ఈ పనికి పాల్పడ్డారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు.

More Telugu News