YCP MP RaghuRam Krishnam Raju: నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం జగన్ తో చర్చించా: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు

  • బీజేపీతో మా నేతలు ఎవరూ టచ్ లో లేరు
  • పార్లమెంట్ లో పీఎం మోదీ పలకరిస్తే.. మీడియా దుమారం లేపుతోంది
  • బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై అతన్నే అడగండి

బీజేపీ నేతలతో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు టచ్ లో ఉంటున్నారని వార్తలు రావటంతో గత కొన్ని రోజులుగా ఏపీలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. అధికార పార్టీతో పాటు, అన్ని పార్టీల నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు దీనికి తోడయ్యాయి.

ఈ నేపథ్యంలో ఈ రోజు రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ లో ప్రధాని మోదీ తనను గుర్తుపట్టి పలకరించారని, దీన్ని ఇంకో విధంగా అర్థం చేసుకోరాదని సూచించారు. ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సుజనా చౌదరి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆయన్నే అడగాలని మీడియా ప్రతినిధులకు సూచించారు.

ఈ రోజు రఘురామకృష్ణంరాజు తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలవడం జరిగింది. సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే ఆర్ అండ్ బీ ముఖ్యకార్శదర్శి ఎంటీ కృష్ణబాబుతో కలిసి సీఎం వద్దకు వెళ్లానని చెప్పారు.

వశిష్ఠ వారధి ప్రారంభోత్సవం పెండింగ్ లో ఉందని.. దీనిపై సీఎంతో చర్చించాలని కలిశానన్నారు. పార్లమెంట్ లో చర్చ సందర్భంగా తెలుగు అభివృద్ధిపై వివరించానని సీఎంకు తెలిపానన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో నియోజకవర్గ అభివృద్ధిపై జగన్ తో చర్చలు చేశానని తెలిపారు.  

More Telugu News