జేసీబీని పట్టుకుని వేళ్లాడిన మహిళా సర్పంచ్... వీడియో వైరల్

22-11-2019 Fri 21:14
  • రాజస్థాన్ లో ఘటన
  • అక్రమ కట్టడాల కూల్చివేతకు అధికారుల యత్నం
  • వ్యతిరేకించిన మహిళా సర్పంచ్
  • జేసీబీకి ఎదురొడ్డి నిలిచిన వైనం
రాజస్థాన్ లో అక్రమ కట్టడాల కూల్చివేతకు జేసీబీ సహా వచ్చిన అధికారులకు ఓ మహిళా సర్పంచ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె జేసీబీని ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్న వైనం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రాజస్థాన్ లోని మంద్వాలా గ్రామంలో కొన్ని నిర్మాణాలకు అనుమతుల్లేవంటూ అధికారులు కూల్చివేతకు ప్రయత్నించారు. అయితే సర్పంచ్ రేఖాదేవి అపర కాళీమాత అవతారం ఎత్తారు. ఒక్క నిర్మాణం కూల్చినా సహించేది లేదంటూ హెచ్చరించారు.

అంతేకాదు, కూల్చివేతకు వస్తున్న జేసీబీ మెకానికల్ హ్యాండ్ ను పట్టుకుని వేళ్లాడారు. జేసీబీని డ్రైవర్ ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేసినా రేఖాదేవి పట్టువదలకుండా మెషీన్ హ్యాండ్ ను వదలకుండా పట్టుకున్నారు. చేసేది లేక జేసీబీ అక్కడి నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోంది.