Piyush Goyal: భారతీయ రైల్వే ఎప్పుడూ ప్రజల సంపదే... ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు: రైల్వే మంత్రి పియూష్ గోయల్

  • రాబోయే 12 ఏళ్లలో రైల్వే మనుగడకు రూ.50 లక్షల కోట్లు కావాలని అంచనా
  • అంత మొత్తం సమకూర్చడం ప్రభుత్వం వల్లకాదన్న గోయల్
  • కొన్ని విభాగాల్లో ప్రైవేటు వ్యక్తులకు అనుమతులని వెల్లడి

కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రాజ్యసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సభ్యుల ప్రశ్నలకు బదులిచ్చారు. వచ్చే 12 సంవత్సరాల్లో రైల్వే మనుగడ కోసం రూ.50 లక్షల కోట్లు కావాలని కేంద్రం అంచనా అని తెలిపారు. ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చడం ప్రభుత్వానికి కష్టసాధ్యం అని పేర్కొన్నారు. అయితే రైల్వేను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, భారతీయ రైల్వే ఎప్పుడూ ప్రజల సంపద అని స్పష్టం చేశారు.

ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించడానికే తమ ప్రయత్నమని, కేవలం కొన్ని విభాగాల్లోనే ప్రైవేటు వ్యక్తులను అనుమతిస్తున్నట్టు వెల్లడించారు. వాణిజ్యపరమైన, ఆన్ బోర్డు సేవలు మాత్రమే ప్రైవేటు పరం చేస్తున్నామని వివరించారు. అటు రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ మాట్లాడుతూ, ఇది కార్పొరేటీకరణ తప్ప ప్రైవేటీకరణగా తాము భావించడంలేదని పేర్కొన్నారు.

More Telugu News