Telangana: ఆర్టీసీ జేఏసీ గందరగోళ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ.. కార్యదర్శి నగేష్ పటేల్ రాజీనామా

  • స్టేట్ కమిటీ నేతలతో చెప్పకుండానే జేఏసీ పెద్దలు సమ్మె విరమణ ప్రకటన చేశారని ఆరోపణ
  • సమ్మెపై ఆర్టీసీ జేఏసీ వెనక్కి తగ్గడంతో కార్మికుల్లో గందరగోళ పరిస్థితులు
  • కొందరు విధుల్లో చేరడానికి సిద్ధమవుతున్న వైనం

ఆర్టీసీ జేఏసీ గందరగోళ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ..జేఏసీ రాష్ట్ర కార్యదర్శి నగేష్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. జేఏసీ పెద్దలు స్టేట్ కమిటీ నేతలతో చెప్పకుండా సమ్మెపై విరమణ చేస్తామని ప్రకటించారని ఆరోపించారు. కార్మికులు విధుల్లో చేరడానికి సీఎం కేసీఆర్ అవకాశమిచ్చినప్పుడే బేషరతుగా చేరివుంటే బాగుండేదని నగేష్ మీడియాతో అన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.

సమ్మెపై ఆర్టీసీ జేఏసీ వెనక్కి తగ్గడంతో మరోవైపు కార్మికుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు కార్మికులు విధుల్లో చేరడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుంటే వారిని వెనక్కి పంపిస్తామని ఆర్టీసీ అధికారులు చెపుతున్నట్లు సమాచారం. అఫిడవిట్ సమర్పించి విధుల్లో చేరవచ్చని కార్మికుల్లో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కార్మికులు డిపో మేనేజర్లను కూడా సంప్రదించారు. కాగా డిపో మేనేజర్లు అలాంటిదేమీ ఉండదని వారికి తెలిపినట్లు తెలుస్తోంది.

More Telugu News