Bullet Train: మహారాష్ట్రలో ఆ ప్రభుత్వమే వస్తే కనుక.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు బ్రేకులు పడినట్టే!

  • ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు
  • శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం వస్తే ఈ ప్రాజెక్టుకు కొత్త సమస్యలు
  • ప్రాజెక్టు కోసం రూ. 5 వేల కోట్లను ఖర్చు చేస్తున్న మహారాష్ట్ర

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే వీరి మధ్య చర్చలు ఫలప్రదమయ్యాయని... అధికారిక ప్రకటనే ఆలస్యమని తెలుస్తోంది. ఇదే జరిగితే... ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై-అహ్మదాబాద్ (గుజరాత్) బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు బ్రేకులు పడినట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మన దేశంలో చేపట్టిన తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఇదే అనే విషయం అందరికీ తెలిసిందే.

రూ. లక్ష కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఈ మొత్తంలో రూ. 88 వేల కోట్లను జపాన్ రుణంగా (0.1 శాతం వడ్డీ) ఇస్తోంది. మిగిలిన మొత్తానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ 5 వేల కోట్లను ఖర్చు చేస్తోంది.

ప్రస్తుతం మహారాష్ట్ర రైతులు తీవ్ర సమస్యల్లో ఉన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వారంతా ఆర్థికంగా మరింతగా చితికిపోయారు. రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి రైతు సమస్యలే తొలి సవాల్ గా నిలవనున్నాయి.

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ కు చెందిన ఓ సీనియర్ నేత మాట్లాడుతూ, బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ఎలాంటి ఖర్చు చేయబోదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ముందుకు సాగాలంటే కేంద్ర ప్రభుత్వమే మొత్తం ఖర్చును భరాయించాలని చెప్పారు. రైతుల సంక్షేమమే తమకు ముఖ్యమని... రైతు రుణమాఫీ కూడా తమ ఆలోచనలో ఉందని తెలిపారు. మహారాష్ట్రలో తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే... ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు.

మరోవైపు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు 48 శాతం భూసేకరణ పూర్తయింది. పలు పనులకు సంబంధించి టెండర్లను కూడా పిలిచారు. 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైలు ప్రయాణిస్తుంది. షెడ్యూల్ ప్రకారం 2023కు ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది.

More Telugu News