Ratan Tata: రతన్ టాటా భుజంపైనే చెయ్యేసిన ఈ కుర్రాడి గురించి తెలుసా?

  • రతన్ టాటా వద్ద అసిస్టెంట్ గా చేరిన శంతను
  • ఐదేళ్ల క్రితమే ఇద్దరికీ పరిచయం
  • 2014లో శునకాలకు బెల్ట్ లు తయారు చేసి ఫేమస్ అయిన శంతను

భారత పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరైన రతన్ టాటా వద్ద తాను ఎలా ఉద్యోగంలో చేరానో చెబుతూ శంతను నాయుడు అనే యువకుడు 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ఫేస్‌ బుక్ పేజీ ద్వారా ప్రజలతో చెప్పుకోగా, అది వైరల్ అయింది. అప్పటికి ఐదేళ్ల ముందే శంతను, రతన్ టాటాను కలుసుకుని, ఆయన భుజంపైనే చెయ్యేశాడు. ఆనాటి ఫోటోయే ఇప్పుడు హైలైట్ అవుతోంది. రతన్ టాటాను కలిసిన తరువాత తన జీవితమే మారిపోయిందని చెప్పే శంతను నాయుడు వాస్తవ కథలోకి వెళితే...

2014లో శంతను నాయుడు రోడ్డుపై వెళుతున్న సమయంలో, ఓ ప్రమాదానికి గురైన వీధికుక్కను చూశాడు. అది మరణించిన విధానం శంతనును కలిచివేసింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని శునకం చనిపోయిందని తెలుసుకున్న అతను, దూరం నుంచి కూడా వాహనదారులకు రోడ్లపై ఉండే శునకాలు కనిపించేలా ఓ బెల్ట్ ను తయారు చేశాడు. వాటిని వీధి కుక్కలకు ధరింపజేశాడు.

ఈ విషయం అప్పట్లోనే పత్రికల్లో వచ్చింది. టాటా గ్రూపు సంస్థల న్యూస్ లెటర్‌ లో ఆర్టికల్ గానూ ప్రచురించారు. ఆపై రతన్ టాటా నుంచి శంతనుకు ఓ లెటర్ వచ్చింది. తనకు శునకాలంటే ఎంతో ప్రేమని చెబుతూ, శంతనును రతన్ టాటా ప్రశంసించారు. ఆపై శంతను ఓ లేఖను రతన్ టాటాకు రాయగా, రెండు నెలల తరువాత సమాధానం వచ్చింది. ఆపై ఇద్దరూ కలిశారు. శంతను చేసిన పరిశోధనను ప్రశంసిస్తూ, తన వద్దే పని చేయాలని కోరారు.

ఉన్నత చదువులు చదివిన తరువాత టాటా సంస్థలకే తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పిన శంతను, విదేశాల్లో చదువులు ముగించుకుని ఇండియాకు వచ్చాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న రతన్ టాటా స్వయంగా ఫోన్ చేసి, తనకు అసిస్టెంట్ గా విధుల్లో చేరాలని సూచించారు. ఆ విధంగా తాను టాటా సంస్థల్లో ఉద్యోగిగా మారానని శంతను నాయుడు ఫేస్‌ బుక్ పేజీలో వివరించారు. నిమిషాల వ్యవధిలోనే ఈ పోస్ట్ వైరల్ అయింది.

More Telugu News