PV Sindhu: పీవీ సింధూ వరుస ఓటములకు కారణం చెప్పిన పుల్లెల గోపీచంద్!

  • వరల్డ్ బ్యాడ్మింటన్ తరువాత వరుస ప్రయాణాలు
  • అందుకే ఆటతీరు మారిపోయింది
  • తిరిగి సత్తా చాటుతుందన్న నమ్మకం ఉంది
  • కోల్ కతాలో మీడియాతో పుల్లెల గోపీచంద్

ఈ సంవత్సరం ఆగస్టులో వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ను గెలుచుకున్న తరువాత పీవీ సింధూ ఆట గాడి తప్పిందని చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అంగీకరించారు. తాజాగా కోల్ కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన, అత్యంత బిజీ షెడ్యూల్, తీరిక లేకుండా పదే పదే ప్రయాణాలు చేయడం వల్లనే సింధు ఆటతీరు మారిందని, అందువల్లే ఆరంభ రౌండ్లలోనే ఆమె విఫలమవుతోందని అన్నారు. గడచిన రెండు నెలల్లో సింధూ ఆటతీరు సంతృప్తికరంగా లేదని, అయినప్పటికీ, ఆమె తిరిగి తన సత్తా చాటుతుందనే భావిస్తున్నానని అన్నారు. త్వరలోనే సింధూ గెలుపు బాట పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

వరల్డ్ చాంపియన్ షిప్ తరువాత వరుసగా చైనా, కొరియా, డెన్మార్క్, హాంకాంగ్ దేశాలకు సింధూ వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేసిన గోపీచంద్, మరికొందరు వరల్డ్ ప్లేయర్స్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అన్నారు. త్వరలో జరిగే టోక్యో ఒలింపిక్స్ లో షటిల్ క్రీడలో ఇండియాకు పతకాలు వస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగే డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ని తిలకించేందుకు గోపీచంద్, సింధూలు వచ్చారు. ఈ సందర్భంగా వీరిని బీసీసీఐ సత్కరించనుంది.

More Telugu News