Jagan: అయ్యప్ప మాలేసుకున్న వారితో తిట్టిస్తే ఊరుకుంటామనా?: దేవినేని ఉమ నిప్పులు

  • ఆరు నెలల్లోనే జగన్ ప్రభుత్వం విఫలం
  • జగన్ పై సొంత పార్టీ ఎంపీలే మండిపడుతున్నారు
  • మీడియాతో దేవినేని ఉమ

ప్రభుత్వ వైఫల్యాలపై తాను నిలదీస్తుంటే, అయ్యప్ప మాల వేసుకున్న వారితో తిట్టిస్తున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఆరు నెలల్లోనే జగన్ ప్రభుత్వం విఫలమైందని, జగన్ ఓ విఫల నేతగా మిగిలిపోయారని ఆరోపించారు. జగన్ పై ఆయన సొంత పార్టీ ఎంపీలే మండిపడుతున్నారని, ఇంకొన్ని రోజుల్లో ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకం అవుతారని అన్నారు.

రాష్ట్రంలో ఇసుక దొరకకుండా పోయిందని, పోలవరం ప్రాజెక్టు పనులపై ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని ఉమ ఆరోపించారు. మంత్రులు సోయలేకుండా మాట్లాడుతున్నారని, తమ పార్టీ మీద మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారని, 150 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నా, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవబోదని జోస్యం చెప్పారు.

పరమ పవిత్రమైన తిరుమలలో హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా అన్యమత ప్రచారం జరుగుతోందని, విజయవాడ, అన్నవరం, శ్రీశైలంలో సైతం ఇదే పరిస్థితి నెలకొందని దేవినేని ఉమ ఆరోపించారు. సీఎం జగన్, తనపై ఉన్న సీబీఐ కేసులు ఎప్పుడు మీద పడతాయోనన్న అభద్రతాభావంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. మైలవరంలో ఎన్నికలకు ముందు చింపిన నోట్లను పంపిణీ చేసిన కేసులో విచారణకు సిద్ధమా? అని దేవినేని సవాల్ విసిరారు.

More Telugu News