Social Media accounts: సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించబోం: స్పష్టం చేసిన కేంద్రం

  • పార్లమెంటులో అసదుద్దీన్ అడిగిన ప్రశ్నకు రవిశంకర్ ప్రసాద్ సమాధానం
  • దేశంలోని 121 మంది ఫోన్లలోకి ఇజ్రాయెల్ స్పైవేర్
  • ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని ఖాతాలను బ్లాక్ చేసే హక్కు ఉందన్న మంత్రి

సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించే ఉద్దేశం లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తేల్చిచెప్పారు. నిన్న పార్లమెంటులో మాట్లాడిన ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత జర్నలిస్టులు, మానవహక్కుల ఉద్యమకారుల ఫోన్లలోకి ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్  చొరబడిందని, ఈ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.

మంత్రి రవిశంకర్ ప్రసాద్ బదులిస్తూ.. దేశంలోని 121 మంది ఫోన్లలోకి ఈ స్పైవేర్ చొరబడిందని, ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో వాట్సాప్‌ను ఇప్పటికే వివరణ కోరినట్టు తెలిపారు. అలాగే, దేశ ప్రజల ఆధార్ డేటా సురక్షితంగా ఉందని, దీనిపై తరచూ ఆడిటింగ్ జరుగుతోందని చెప్పారు. ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69ఎ ప్రకారం.. ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని ఖాతాలను బ్లాక్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని మంత్రి వివరించారు.

More Telugu News