Guntur District: లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గుంటూరు వైద్య విధాన పరిషత్ అధికారి

  • మంజూరైన రూ.20 లక్షల బిల్లు ఇచ్చేందుకు మూడు నెలలు తిప్పించుకున్న కో ఆర్డినేటర్
  • బిల్లులో 15 శాతం ఇవ్వాలని డిమాండ్ 
  • లక్ష రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం

ఓ కాంట్రాక్టరుకు చెల్లించాల్సిన రూ.20 లక్షల బిల్లు ఇచ్చేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేసిన  వైద్య విధాన పరిషత్ గుంటూరు జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ చుండూరు ప్రసన్నకుమార్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. బాపట్ల, తెనాలి ఆసుపత్రుల్లోని రోగులకు తాడిబోయిన శ్రీనివాసరావు అనే కాంట్రాక్టర్ ఆహారం సరఫరా చేస్తుంటాడు. ఇందుకు సంబంధించి జిల్లా వైద్య విధాన పరిషత్ కార్యాలయం నుంచి రూ.20 లక్షలు రావాల్సి ఉంది.

బిల్లు మంజూరై మూడు నెలలు గడుస్తున్నా జిల్లా కోఆర్డినేటర్ అయిన ప్రసన్న కుమార్ కాంట్రాక్టర్‌కు ఇవ్వకుండా వేర్వేరు కారణాలు చెబుతూ తిప్పించుకుంటున్నాడు. చివరికి బిల్లులో 15 శాతం తనకు ఇస్తే బిల్లు ఇస్తానని అసలు విషయం చెప్పాడు. అంత సొమ్ము ఇచ్చుకోలేనని శ్రీనివాసరావు మొరపెట్టుకున్నాడు. దీంతో లక్ష రూపాయలకు ఒప్పందం కుదిరింది. అయితే, ఆ మొత్తాన్ని కూడా ఇవ్వడం ఇష్టం లేని శ్రీనివాసరావు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు.

వారి సూచన మేరకు లక్ష రూపాయలు సిద్ధం చేశానని ప్రసన్నకుమార్‌కు ఫోన్ చేసి చెప్పాడు. బాపట్లలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గోపీకృష్ణకు ఆ సొమ్ము అందజేయాలని ప్రసన్న కుమార్ చెప్పాడు. గోపీకృష్ణకు ఫోన్ చేసిన కాంట్రాక్టర్ తాను గుంటూరు జిల్లా వైద్య విధాన పరిషత్‌ కార్యాలయం వద్ద ఉన్నానని చెప్పాడు. అక్కడకొచ్చిన గోపీకృష్ణ లంచం డబ్బులు తీసుకుంటుండగా కాపుకాసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం గోపీకృష్ణతోపాటు ప్రసన్న కుమార్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.

More Telugu News