RTC JAC STrike: సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నాం: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి

  • షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
  • అక్టోబర్ 4వ తేదీకి ముందటి పరిస్థితులు కల్పించాలి
  • లేకుంటే సమ్మె యథావిధిగా కొనసాగిస్తాము

సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ప్రజల కోణంలో, కార్మికుల కోణంలో ఆలోచించి ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన చేశామని చెప్పారు. షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవడానికి ప్రభుత్వం ఒప్పుకుంటేనే సమ్మె విరమణకు సిద్ధమని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఈ రోజు జరిపిన జేఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అశ్వత్థామ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

కార్మికుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయొద్దని ఆయన ప్రభుత్వానికి సూచించారు. విధుల్లోకి తీసుకున్న కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకుకోకుండా అక్టోబర్ 4కు ముందున్న పరిస్థితులను కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై స్పందించకుంటే సమ్మె కొనసాగుతుందని చెప్పారు. ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు పెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం డ్యూటీ ఛార్జీలపై సంతకాలు పెడతామని అన్నారు.

హైకోర్టు ఆదేశం మేరకు అన్ని డిమాండ్లను లేబర్ కోర్టుకు తెలిపామన్నారు. లేబర్ కోర్టులో న్యాయం జరుగుతుందన్న విశ్వాసముందని చెప్పారు. మూడు నెలల్లో సమస్య పరిష్కారమవుతుందన్నారు. సమ్మెపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. కోర్టు తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ఇరు పక్షాలపై ఉందన్నారు. పరిస్థితులు మెరుగుపరుచుకునేందుకే సమ్మె చేస్తారని, విధులు వదిలిపెట్టినట్లు మాత్రం కాదని కోర్టు చెప్పిన విషయాన్ని విస్మరించవద్దన్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఈ తీర్పును గౌరవిస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. లేని పక్షంలో సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.



More Telugu News