Delhi: ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు పొల్యూషన్ మాస్కులు... ఎయిర్ ఏషియా నిర్ణయం

  • ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం
  • ప్రయాణికులను తమ అతిథులుగా భావిస్తున్న ఎయిర్ ఏషియా
  • ప్రయాణికుల క్షేమం కోసమే ఈ నిర్ణయమని వెల్లడి

దేశ రాజధానిలో కాలుష్యం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పొగమంచు కమ్మినట్టు కాలుష్య మేఘాలు నిత్యం ఢిల్లీపై ఆవరించి ఉంటాయి. కాలుష్య నియంత్రణ మండలి కూడా ఇప్పటికే అనేక సార్లు ఢిల్లీ పొల్యూషన్ పై అత్యయిక స్థితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఎయిర్ ఏషియా  విమానయాన సంస్థ ఇండియా విభాగం తన ప్రయాణికుల క్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

తమ విమానాల్లో ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు పొల్యూషన్ మాస్కులు అందివ్వాలని నిర్ణయించుకుంది. బెంగళూరు, ముంబయి, హైదరాబాద్, కోల్ కతా వంటి ప్రధాన నగరాల నుంచి ఢిల్లీ వెళ్లే ప్రయాణికులు దేశరాజధానిలో కాలుష్యం బారినపడకుండా తామందించే మాస్కులు ఉపయోగపడతాయని ఎయిర్ ఏషియా చెబుతోంది.

ప్రయాణికులను తాము అతిథులుగా భావిస్తామని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన ప్రయాణ అనుభూతి కలిగించడం తమ బాధ్యత అని ఎయిర్ ఏషియా సీఓఓ సంజయ్ కుమార్ తెలిపారు. ఈ నెలాఖరు వరకు పొల్యూషన్ మాస్కులు అందిస్తామని వెల్లడించారు. మాస్కుల పథకం మంగళవారం నుంచి ఈ నెల 29వరకు అమలు చేస్తామని వివరించారు.

More Telugu News