Andhra Pradesh: ఏపీలో బార్ల సంఖ్య 40 శాతానికి తగ్గింపు.. సీఎం ఆదేశాలు!

  • రాష్ట్ర్లంలో మద్యం పాలసీపై సీఎం, అబ్కారీ శాఖ మంత్రి, అధికారులతో సమీక్షలో నిర్ణయం
  • బార్లలో మద్యం సరఫరా వేళలు కుదింపు
  • ఆహారం సరఫరా వేళలు రాత్రి 11గంటలుగా నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న మద్యం విధానంపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. సీఎం జగన్ అధ్వర్యంలో కొనసాగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి, అధికారులు పాల్గొన్నారు. బార్ల సంఖ్య, మద్యం సరఫరా వేళలు, కల్తీ మద్యం, స్మగ్లింగ్ తదితర అంశాలపై చర్చలు కొనసాగాయి.

రాష్ట్రంలో ఉన్న 798 బార్లను 50 శాతానికి తగ్గించాలని సీఎం తొలుత ప్రతిపాదించారు. అయితే అధికారులు ఇప్పటికే మద్యం దుకాణాలను 20శాతానికి తగ్గించామని చెప్పారు. దశలవారీగా బార్ల సంఖ్యను తగ్గించాలని సూచించారు. ఈ అంశంపై జరిగిన చర్చల తర్వాత వాటి సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని సీఎం అధికారులను ఆదేశించారు.  

అలాగే, బార్లలో మద్యం సరఫరా వేళలను తగ్గించేందుకు నిర్ణయం చేశారు. ఉదయం 11గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం సరఫరా చేయాలని నిర్ణయించగా, రాత్రి 11 గంటలవరకు ఆహారం సరఫరా చేయాలని సీఎం సూచించారు. స్టార్ హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11వరకు మద్యం సరఫరా చేయవచ్చని పేర్కొన్నారు. మద్యం స్మగ్లింగ్, కల్తీ, నాటుసారా తయారీకి పాల్పడ్డవారిపై నాన్ బెయిలబుల్ కేసులు  నమోదు చేసి, భారీగా జరిమానాలు విధించాలని సూచించారు.

More Telugu News