Georgereddy: ‘జార్జిరెడ్డి’లో వాస్తవాలు చూపించకపోతే మా రియాక్షన్ తప్పదు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక

  • సినిమా ముసుగులో ఏబీవీపీని కించపరిస్తే సహించం
  • జార్జిరెడ్డిని ఏబీవీపీ వ్యక్తులు హత్య చేశారన్నట్టు చూపిస్తున్నారు!
  • ఈ సినిమాలో కొన్ని షాట్స్ కట్ చేయాలి

విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘జార్జిరెడ్డి’. ఈ సినిమా ప్రచార చిత్రంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విరుచుకుపడ్డారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రోమోలో ‘వన్ సైడ్’గా చూపించారని విమర్శించారు. వాస్తవం ఏంటో చూపిస్తేనే ప్రజల నుంచి స్పందన వస్తుందని అన్నారు.  

సినిమా ముసుగులో ఏబీవీపీని కించపరిస్తే సహించమని, అలా చేస్తే కనుక అడ్డుకుంటామని హెచ్చరించారు. జార్జిరెడ్డి హత్య సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుందని, ఏబీవీపీకి చెందిన వ్యక్తులు ఈ హత్య చేశారన్నట్టుగా ఈ మూవీలో చూపిస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలు చూపించండి, అబద్ధాలు కనుక చూపిస్తే తమ నుంచి ‘హండ్రెడ్ పర్సంట్ రియాక్షన్ వుంటుంది’ అని హెచ్చరించారు.

ఈ సినిమాలో కొన్ని షాట్లను కట్ చేయాలని డిమాండ్ చేశారు. అసలు, ఇలాంటి చిత్రాలకు సెన్సార్ బోర్డు ఎలా పర్మిషన్ ఇస్తోందో తనకు అర్థం కావడం లేదని అన్నారు. ఏదో ఒక పాత కథను తీసుకుని, మసాలా జోడించి ఒక వర్గాన్ని తక్కువగా మరో వర్గాన్ని ఎక్కువగా చూపించేలా చిత్రాలు తీయడం ఈరోజు ఓ బిజినెస్ అయిపోయిందని విమర్శించారు. ఈ సినిమాలో వాస్తవాలు చూపించాలని కోరుతున్నామని లేకపోతే వాళ్ల ఇష్టమని డైరెక్టరు, ప్రొడ్యూసర్లను ఉద్దేశించి రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

More Telugu News