Chandrababu: మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేయడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది: చంద్రబాబు నాయుడు

  • వైసీపీ వేధింపులు తారస్థాయికి చేరాయి
  • కార్యకర్తలు తనను కలుసుకోకుండా చేస్తారా అంటూ ఆగ్రహం
  • చింతమనేనిపై అక్రమ కేసులు పెట్టారని విమర్శ

వైసీపీ ప్రభుత్వం వేధింపులు తారస్థాయికి చేరాయని చంద్రబాబు అన్నారు. తన దగ్గరికి కార్యకర్తలను కూడా రానీయకుండా చేశారని విమర్శించారు. చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించారు. పర్యటనలో రెండో రోజైన ఈరోజు చంద్రబాబు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ వేధింపులు విపరీతంగా పెరిగాయని, తననుంచి కార్యకర్తలను దూరం చేయాలన్న తలంపుతో పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. తనకు నోటీసులు కూడా ఇచ్చారన్నారు. తనను కలిస్తే.. కేసులు పెడతామని హెచ్చరికలు కూడా జారీ చేశారని చెప్పారు. మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేయడమే వారి లక్ష్యంగా కనిపిస్తోందన్నారు.

‘నా పర్యటన వలనే పోలీసు యాక్ట్ 30 పెట్టారు. కొంతమంది పోలీసు అధికారులు లాలూచీ పడి, పోస్టింగ్‌ల కోసం ఇలా చేస్తున్నారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే సహించేదిలేదు. గతంలో తండ్రిని అడ్డంపెట్టుకుని.. అవినీతికి పాల్పడిన కొడుకుకు అధికారులు సహకరిస్తే, తర్వాత వారంతా జైలుకు పోయారు. చింతమనేనిపై పలు అక్రమ కేసులు పెట్టారు. సాక్షాత్తూ ఒక ఎస్పీ కేసులు పెట్టమని ప్రోత్సహిస్తే, శాంతి భద్రతలు ఎవరు పరిరక్షిస్తారు? నా భద్రతను సాకుగా చూపిస్తూ.. ఇతర కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆశా వర్కర్లను పరామర్శించిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పైనా కేసు పెట్టారు. ఇష్టమున్నట్లు తప్పుడు కేసులు పెట్టి తప్పించుకుందాం అనుకుంటున్నారా?’ అని చంద్రబాబు మండిపడ్డారు.

More Telugu News