Jana Sena: ధర్మవరంలో పోలీసుల భయంతో పురుషులు ఊరొదిలి వెళ్లిపోయారు: పవన్ కల్యాణ్

  • గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు
  • జనసేన పార్టీ కార్యకర్తల నాటక ప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు
  • ధర్మవరం గ్రామం అశాంతితో అల్లాడిపోతోందన్న పవన్
  • లాఠీలతో కొట్టడానికి పోలీసులకి ఎవరు అనుమతి ఇచ్చారు? అని నిలదీత

గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తలు నాటక ప్రదర్శన చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో గ్రామస్తులకు వాగ్వివాదం జరగడంతో, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో పోలీసుల వాహనంఫై గ్రామస్తులు రాళ్లు రువ్వారు. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

'ఓ పోలీసు ఉద్యోగి అనాలోచిత, విచక్షణారహిత, పక్షపాత వ్యవహార శైలివల్ల నేడు ధర్మవరం గ్రామం అశాంతితో అల్లాడిపోతోంది. గుంటూరు జిల్లా దుర్గి మండలంలో ఉన్న ఈ గ్రామంలో చాలా మంది పురుషులు పోలీసుల భయం కారణంగా గ్రామం వదిలి ఇతర ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది' అని పవన్ తెలిపారు.

'శాంతి, భద్రతలు కాపాడాల్సిన పోలీసులే అశాంతికి కారణమైతే ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? గ్రామంలో ఏటా జరిగే తిరునాళ్లలో ఆనందంగా నాటికను ప్రదర్శించడమే పాపమా? ఆ నాటికలో జనసేన జెండాలు ప్రదర్శించడమే నేరమా?' అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
 
'నాటికను మధ్యలో బలవంతంగా ఆపేసే అధికారం ఆ పోలీసు ఉద్యోగికి ఎవరు ఇచ్చారు? ఈ నాటిక ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది పోలీసులే.. దీనిని ప్రశ్నించిన మహిళను నెట్టివేయమని ఏ చట్టం చెబుతోంది? లాఠీలతో కొట్టడానికి ఆ అధికారికి ఎవరు అనుమతి ఇచ్చారు?' అని పవన్ నిలదీశారు.

 'అక్రమంగా అరెస్టు చేసిన జనసేన కార్యకర్తలను విడుదల చేయాలి. మరో 32 మందిపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలి. ఎవరెలా రెచ్చగొట్టినప్పటికీ మేము శాంతియుతంగా సమాధానం చెబుతాం. ఇటువంటి సమయంలో జనసైనికులు సంయమనం పాటించాలని నేను కోరుతున్నాను' అని పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

More Telugu News