Swami Nithyananda: నిత్యానంద ఆశ్రమంలో తమ ఇద్దరు కూతుళ్లనూ బంధించారంటూ హైకోర్టులో తల్లిదండ్రుల పిటిషన్!

  • మా ఇద్దరు కూతుళ్లను కిడ్నాప్ చేశారు
  • చట్ట విరుద్ధంగా బంధించారు
  • వారిని క్షేమంగా అప్పగించేలా పోలీసులు, పీఠానికి చెందిన అధికారులను ఆదేశించండి

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తమ ఇద్దరు కూతుళ్లను నిత్యానందకు చెందిన ఓ ఆశ్రమంలో బంధించారని వారి తల్లిదండ్రులు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని కోరుతూ నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్వామి నిత్యానందకు చెందిన బెంగళూరులోని ఓ విద్యా సంస్థలో తమ నలుగురు కుమార్తెలను (7 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు) చేర్పించామని జనార్దనశర్మ, అతని భార్య కోర్టుకు తెలిపారు.

నిత్యానంద ధ్యానపీఠానికి సంబంధించిన అహ్మదాబాద్ లోని యోగిని సర్వజ్ఞ పీఠానికి తమ కుమార్తెలను ఈ ఏడాది తరలించారని, వారిని కలిసేందుకు తాము యత్నించామని, కానీ, సదరు సంస్థ అధికారులు తమను అనుమతించలేదని వారు తెలిపారు. ఆ తర్వాత పోలీసుల సహకారంతో తాము పీఠానికి వెళ్లామని, ఆ సందర్భంగా మైనర్లయిన ఇద్దరు కుమార్తెలను తాము వెనక్కి తీసుకొచ్చామని తెలిపారు.

కానీ, తమ ఇద్దరు పెద్ద కుమార్తెలు లోపముద్ర (21), నందిత (18) మాత్రం తమతో రాలేదని చెప్పారు. వారిద్దరినీ పీఠానికి చెందిన అధికారులు కిడ్నాప్ చేశారని, చట్ట విరుద్ధంగా బంధించారని ఆరోపించారు. తమ కూతుళ్లను సురక్షితంగా తమకు అప్పగించేలా పోలీసులను, పీఠానికి చెందిన అధికారులను ఆదేశించాలని కోరారు.

More Telugu News