Raghurama Raju: మాతృ భాష పరిరక్షణకు కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలి: లోక్ సభలో వైసీపీ ఎంపీ

  • ఆర్టికల్ 350, 350ఏల స్ఫూర్తి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి
  • తెలుగు అకాడమీని విభజించేందుకు కేంద్రం సహకరించాలి
  • వందల కోట్ల నిధులు హైదరాబాదులోనే ఉండిపోయాయి

విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెడుతున్నామంటూ వైసీపీ ప్రభుత్వం ఓ వైపు చెబుతుంటే... లోక్ సభలో దానికి విరుద్ధమైన వాదనను ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వినిపించారు. మాతృ భాషను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలను తీసుకోవాలని ఆయన అన్నారు. రాజ్యాంగంలో మాతృ భాష పరిరక్షణకు ఉద్దేశించిన ఆర్టికల్ 350, 350ఏల స్ఫూర్తి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాథమిక స్థాయిలో విద్యా బోధనకు సంబంధించిన అంశాలను ఈ అధికరణలు ప్రస్తావిస్తాయి.

ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు అకాడమీని విభజించేందుకు కేంద్రం సహకరించాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. తెలుగు అకాడమీకి చెందిన వందల కోట్ల నిధులు హైదరాబాదులోనే ఉండిపోయాయని ఆయన అన్నారు. విభజన చట్టంలో తెలుగు అకాడమీ కూడా ఉందని చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలుగు అకాడమీకి చెందిన నిధులను 58:42 నిష్పత్తిలో విభజించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

More Telugu News