Telangana: ‘సడక్ బంద్’ను విరమించుకున్న తెలంగాణ ఆర్టీసీ జేఏసీ.. నేడు సమ్మెపై కీలక ప్రకటన!

  • నేడు కార్మిక సంఘాలతో జేఏసీ సమావేశం
  • సమ్మెపై కీలక నిర్ణయం తీసుకోనున్న జేఏసీ నేతలు
  • చర్చల కోసం సడక్ బంద్‌ను విరమించుకున్నామన్న అశ్వత్థామరెడ్డి

తమ డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై కార్మిక సంఘాలు వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో సమ్మెను కొనసాగించాలా? లేక, వెనక్కి తగ్గాలా? అన్న విషయంపై ఆర్టీసీ జేఏసీ నేడు నిర్ణయం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో నేడు తలపెట్టిన ‘సడక్ బంద్’ను కార్మిక సంఘాలు వాయిదా వేశాయి. సమస్యల పరిష్కారం కోసం 45 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని ప్రభుత్వం వాదిస్తోంది. కార్మికుల డిమాండ్ల సాధన సాధ్యం కాదని తేల్చి చెప్పేసింది.

మరోవైపు, ఆర్టీసీ సమ్మె విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ కార్మిక శాఖను హైకోర్టు సోమవారం ఆదేశించింది. దీంతో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలు నిరాహార దీక్షను విరమించారు. నేడు అన్ని కార్మిక సంఘాల నేతలతో సమావేశం నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో సమ్మెపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. హైకోర్టు తీర్పును పరిశీలించి నేడు భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు జరిపే ఉద్దేశంతోనే సడక్ బంద్‌‌ను విరమించుకున్నట్టు తెలిపారు. అయితే, సమ్మెతోపాటు ఆందోళనలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

More Telugu News