Giri Vikasam: ‘గిరి వికాసం’ లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి

  • పథకం అమలుతీరును అధికారులతో సమీక్షించిన మంత్రులు
  • పనుల కొనసాగుతున్న తీరుపై కలెక్టర్లతో భేటీ కానున్నట్లు ప్రకటన
  • అంగన్‌వాడీ భవనాలకు మ్యాచింగ్ గ్రాంట్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచే ఇవ్వాలని ఆదేశం

తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లోని రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన గిరి వికాసం పథకంపై  గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులతో సమీక్షించారు. ఆ ప్రాంతాల్లోని రైతుల భూములను సాగుకు యోగ్యంగా మార్చేందుకు అమలవుతున్న గిరివికాసం పనులను వేగవంతం చేయాలని సూచించారు. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను శీఘ్రంగా పూర్తి చేయాలంటూ సమావేశంలో పాల్గొన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ రఘునందన్ రావు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు తదితర అధికారులను ఆదేశించారు.

గిరివికాసం పనులను వేగవంతం చేయడంలో భాగంగా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రులు ప్రకటించారు. అంగన్‌వాడీ భవనాలకు కూడా మ్యాచింగ్ గ్రాంట్ ను గ్రామీణాభివృద్ధి శాఖ నుంచే వెంటనే ఇచ్చే విధంగా చూడాలని ఎర్రబెల్లి ఆదేశించారు. ఈ భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు అందుతున్నాయని.. పనులు ఆలస్యం చేయవద్దని అన్నారు.

More Telugu News