TSRTC: ఆర్టీసీ సమ్మె చట్టసమ్మతమో, చట్టవిరుద్ధమో లేబర్ కోర్టు చెబుతుంది: హైకోర్టు

  • తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ
  • కార్మికులతో చర్చలు జరపలేమన్న అడ్వొకేట్ జనరల్
  • సమ్మె చట్టవ్యతిరేకం అని చెప్పలేమన్న హైకోర్టు

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తమ వాదనలను వినిపించగా, వాటికి హైకోర్టు బదులిచ్చింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ అంశంలో సుప్రీం కోర్టు గతంలో పలు తీర్పులు ఇచ్చిందంటూ ఉదహరించారు.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించలేనివని, కార్పొరేషన్ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిందని వివరించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేమని స్పష్టం చేశారు. విలీనం డిమాండ్ ను తాత్కాలికంగా పక్కనబెట్టినా, మళ్లీ ఆ డిమాండ్ తో ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలని చూస్తారని తెలిపారు. యూనియన్ల నేతలు స్వార్థంతో ఆర్టీసీని నష్టాల్లోకి నెడుతున్నారని, సమ్మెను చట్టవిరుద్ధం అని ప్రకటించాలని కోరారు.  

దీనికి న్యాయస్థానం స్పందిస్తూ, సమ్మెను చట్టవ్యతిరేకం అని చెప్పలేమని స్పష్టం చేసింది. సమ్మె చట్టసమ్మతమా, లేక చట్టవిరుద్ధమా అనేది లేబర్ కోర్టు నిర్ణయిస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. సమ్మె వ్యవహారంపై కమిటీ వేయడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయకపోవడాన్ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది.

More Telugu News