Ayodhya: అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయడం ఎలా కుదురుతుంది?: అఖిల భారత హిందూ మహాసభ

  • ఇటీవలే అయోధ్య భూవివాదంపై సుప్రీం తీర్పు
  • రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం
  • కక్షిదారులకు మాత్రమే రివ్యూ అవకాశం ఉంటుందన్న మహాసభ న్యాయవాది

దశాబ్దాల తరబడి నలిగిన అయోధ్య భూవివాదం ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తుది తీర్పుతో ఓ కొలిక్కి వచ్చింది. అయితే సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించుకుంది. దీనిపై అఖిల భారత హిందూ మహాసభ స్పందించింది. హిందూ మహాసభ న్యాయవాది వరుణ్ సిన్హా మాట్లాడుతూ, అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయడం కుదరదని స్పష్టం చేశారు. ఈ కేసులో ముస్లిం పర్సనల్ లా బోర్డు కక్షిదారు కాదని, కేవలం కక్షిదారులకు మాత్రం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే సౌలభ్యం ఉంటుందని వెల్లడించారు.

సుప్రీం కోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అని, సుప్రీం ఏదో ఆషామాషీగా తీర్పు ఇచ్చేయదని సిన్హా పేర్కొన్నారు. అన్ని కోణాల్లో విచారణ జరిపిన తర్వాతే తీర్పు ఇస్తుందని అన్నారు. అయినా, అయోధ్య భూవివాదంపై సుప్రీం వెలువరించిన తీర్పులో ముస్లిం పర్సనల్ లా బోర్డుకు ఏం తప్పు కనిపించిందో తనకు అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు.

More Telugu News