Vijayasai Reddy: అఖిలపక్ష సమావేశంలో విజయసాయిరెడ్డి పరువు పోగొట్టుకున్నారు: టీడీపీ ఎంపీ కనకమేడల

  • పార్లమెంటరీ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో విజయసాయిపై అమిత్ షా అసహనం
  • జగన్ కు బెయిల్ రాకుండా కాంగ్రెస్ అడ్డుకుందన్న విజయసాయి
  • సంబంధం లేని విషయాల్లో కలగజేసుకోవద్దన్న అమిత్ షా

వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మీడియాకు వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనపై అసహనం వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. ఈరోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, నిన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్లహ్లాద్ జోషి అధ్యక్షతన పార్లమెంటు లైబ్రరీ భవన్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా, తమ సీనియర్ నేత చిదంబరంకు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న విజయసాయిరెడ్డి... తమ అధినేత జగన్ ఎంపీగా ఉన్న సమయంలో జైల్లో ఉన్నారని... ఆయనకు బెయిల్ రాకుండా కాంగ్రెస్ చేసిందని ఆరోపించారు. దీంతో, ఇతర పార్టీల నేతలు ఆయనను అడ్డుకున్నారు. జగన్ ప్రస్తావన ఇప్పుడెందుకని, ప్రస్తుతం ఆయన ఎంపీ కాదుకదా? అని ప్రశ్నించారు. చిదంబరం బెయిల్ తో జగన్ అంశాన్ని ఎందుకు ముడిపెడతారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, విజయసాయిపై అసహనం వ్యక్తం  చేశారు. ఈ విషయం మధ్యలో మీరెందుకు కలగజేసుకుంటున్నారని విజయసాయిని ప్రశ్నించారు. సంబంధం లేని విషయాల్లో కలగజేసుకోవద్దని సూచించారని కనకమేడల తెలిపారు.

 స్వీయ ప్రయోజనాల కోసం అఖిలపక్ష సమావేశాన్ని వాడుకోబోయి... విజయసాయిరెడ్డి అభాసుపాలయ్యారని ఎద్దేవా చేశారు. తమ ముఖ్యమంత్రి జగన్ జైలు కెళ్లాడని చెప్పి, పరువు పోగొట్టుకున్నారని అన్నారు.

More Telugu News