Nizamabad District: నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి

  • వేడుకకు హాజరై వస్తుండగా ప్రమాదం
  • మృతి చెందిన వారంతా ఒకే గ్రామ వాసులు
  • ప్రమాద సమయంలో కారు వేగం వంద కిలోమీటర్లు

వేడుకకు హాజరై ఆటోలో ఇంటికి వెళ్తున్న వారి పాలిట ఓ కారు మృత్యుశకటంగా మారింది. వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురూ మృత్యు ఒడికి చేరుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం ఠాణాకలాన్ శివారులో జరిగిందీ ఘటన.

జానకంపేటకు చెందిన ఆకుల బాలమణి (55), జక్కం గంగమణి (65), కల్లెపురం సాయిలు (70), చిక్కల సాయిలు (60) కలిసి కుర్నాల్‌పల్లి దర్గా వద్ద ఆదివారం జరిగిన వేడుకకు హాజరయ్యారు. వీరిలో గంగమణి, బాలమణి అక్కా చెల్లెళ్లు. సాయంత్రం వరకు అక్కడ బంధువులతో సరదాగా గడిపి అనంతరం అటోలో బయలుదేరారు. ఐదు కిలోమీటర్ల దూరం వచ్చారో లేదో.. ఎదురుగా వస్తున్న కారు వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో రోడ్డు పక్కన బోల్తాపడగా దానిపై కారు పడడంతో నుజ్జునుజ్జయింది.

ఆటో డ్రైవర్ సహా అందులోని నలుగురూ లోపల చిక్కుకుపోయారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని రక్షించే ప్రయత్నం చేశారు. జేసీబీతో కారును తొలగించి ఆటోలో చిక్కుకున్న వారిని బయటకు తీసి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. డ్రైవర్ నయీమ్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కారులో ఉన్న ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వారంతా అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, వీరిలో ఇద్దరిని ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో కారు వంద కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణిస్తోందని పోలీసులు తెలిపారు.

More Telugu News