Agni-2: ఇక పగలైనా, రాత్రయినా ఒకటే... 'అగ్ని-2' సక్సెస్!

  • ఒడిశా నుంచి ప్రయోగం
  • లక్ష్యాన్ని తాకిన క్షిపణి
  • 1000 కిలోల పేలుడు పదార్థాలు మోసుకెళ్లే సామర్థ్యం

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అగ్ని-2, ఇకపై పగటి పూట అయినా, రాత్రి పూట అయినా, తన లక్ష్యాన్ని చేధిస్తుంది. తొలిసారిగా ఈ ఇంటర్మీడియట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణికి జరిగిన పరీక్షను అధికారులు విజయవంతం చేశారు. ఒడిశా తీరంలోని డాక్టర్‌ అబ్దుల్‌ కలామ్‌ ద్వీపం నుంచి శాస్త్రవేత్తలు అగ్ని-2 క్షిపణిని ప్రయోగించారు. ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) కాంప్లెక్స్‌ - 4 నుంచి దీన్ని ప్రయోగించగా, అది లక్ష్యాన్ని తాకిందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి, 1000 కిలోల పేలుడు పదార్థాలను తీసుకెళుతుందని తెలిపారు. సుమారు 20 మీటర్ల పొడవుండే క్షిపణి బరువు 17 టన్నుల వరకూ ఉంటుందని అన్నారు. కాగా, 1999 ఏప్రిల్‌ 11న తొలిసారిగా అగ్ని క్షిపణిని పరీక్షించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సైన్యం అమ్ముల పొదిలో అగ్ని క్షిపణులు చేరాయి.

More Telugu News