Gannavarm MLA Vallabhaneni Vamshi: అయ్యప్ప మాల వేసుకున్నా.. అందుకే క్షమాపణలు చెబుతున్నా: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

  • రాజేంద్రప్రసాద్ తొలుత తిట్టాడు.. అనంతరం నేను తిట్టాను
  • వయసులో పెద్దవాడని గౌరవిస్తున్నా..
  • చంద్రబాబు కాళ్లకు దండం పెట్టా.. కాళ్లు పట్టుకోలేదు

ఓ ఛానల్లో చర్చలో పాల్గొంటున్న సమయంలో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తొలుత తిడితేనే.. అనంతరం తాను తిట్టానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. గత రెండు రోజులుగా కొసాగుతున్న పరిణామాలపై వంశీ స్పందించారు. ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడారు. ‘చందబాబు నాకు కోట్ల రూపాయలు ఇచ్చారని రాజేంద్రప్రసాద్ చెబుతున్నారు. నా వ్యక్తిగత అవసరాలకోసం డబ్బులు ఇచ్చారా? ఏ పార్టీ అయినా ఎన్నికల కోసం ఇవ్వడం సహజం. ఆ డబ్బుల్ని ఎన్నికల్లోనే ఖర్చుపెట్టాం.

 ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ తొలుత తిట్టారు. వంశీ డబ్బులు తీసుకున్నారనే సరికి కోపం వచ్చింది. అలా మాట్లాడాను. నేనేమైనా వెయ్యికాళ్ల మండపం కూల్చానా? దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేశానా? టీటీడీ బోర్డు సభ్యుల పదవులు అమ్ముకున్నానా? ఏం తప్పు చేశాను? అయ్యప్ప మాల వేసుకుని అలా మాట్లాడావేంటని కొందరు అన్నారు. అయ్యప్పమాల వేసుకున్న వ్యక్తిపై తొలుత అగౌరవంగా మాట్లాడింది ఎవరు? నేను తప్పు చేయలేదు. వయసులో పెద్దవాడు. నేను అయ్యప్పమాల ధరించి ఉన్నా కాబట్టి రాజేంద్రప్రసాద్ కు క్షమాపణ చెబుతున్నా’ అని వంశీ వివరించారు.

పెద్దవాళ్లకు దండం పెట్టడం సంస్కారం


చంద్రబాబు నాయుడు నా తండ్రి లాంటి వారు. ఆయన కాళ్లకు దండంపెడితే కాళ్లు పట్టుకున్నారని విమర్శలు చేయడం తగదని రాజేంద్రప్రసాద్ నుద్దేశించి వంశీ అన్నారు. ‘చంద్రబాబు కాళ్లు పట్టుకున్నానని రాజేంద్రప్రసాద్ చెబుతున్నారు. పెద్ద వాళ్లకు దండం పెట్టడం సంస్కారం. చంద్రబాబు నా తండ్రి లాంటి వారు. కాళ్లకు దండం పెడితే తప్పేంటి? దండం పెట్టడం వేరు, కాళ్లు పట్టుకోవడం వేరు.

సిగ్గుంటే వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని లోకేష్ అంటున్నారు. అలాగే రాజీనామా చేస్తా. అన్నం సతీష్ కుమార్ బాపట్ల ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోవడంతో ప్రజలు తిరస్కరించారని ఎమ్మెల్సీ పదవికి  రాజీనామా చేశారు. లోకేశ్ కూడా అలా ఎందుకు రాజీనామా చేయలేదు. లోకేశ్ ఎమ్మెల్సీగా ఉండాలి.. నేను మాత్రం రాజీనామా చేయాలా? మీకో న్యాయం, ఇతరులకో న్యాయమా?’ అని వంశీ మండిపడ్డారు. ఇటీవల తాను సీఎం జగన్ ను కలసినప్పుడు కేవలం నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యలపై మాత్రమే మాట్లాడానని వంశీ వెల్లడించారు. నా అభ్యర్థనలపై జగన్ సానూకూలంగా స్పందించారన్నారు.

More Telugu News