TSRTC: ఇంటి వద్దే దీక్ష ప్రారంభించిన టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి

  • ఇందిరాపార్క్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో నిర్ణయం
  • దీక్ష నేపథ్యంలో ఉదయం నుంచి హైడ్రామా
  • అశ్వత్థామరెడ్డి ఇంటిని ఉదయమే చుట్టుముట్టిన పోలీసులు

పోలీసులు ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెనక్కి తగ్గలేదు. చెప్పిన విధంగానే ఈరోజు ఉదయం మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊర్మిళా నగర్ లోని తన స్వగృహంలోనే దీక్షకు దిగారు. వాస్తవానికి ఇందిరాపార్క్ లో దీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ అనుమతి లేదంటూ పోలీసులు ప్రాంగణం వద్దకు రానివ్వక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

 దీక్షను దృష్టిలో పెట్టుకుని ఉదయానికే పోలీసులు అశ్వత్థామరెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు భారీ సంఖ్యలో ఊర్మిళా నగర్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. దీక్షకు ఎటువంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించారు.

అనంతరం ఇంటివద్దే దీక్ష చేయాలని అశ్వత్థామ రెడ్డి నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తనను బలవంతంగా అరెస్టు చేసినా దీక్ష ఆగదని తెలిపారు. అర్ధ రాత్రివేళ తన ఇంటిని చుట్టుముట్టి పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News