'పునాదిరాళ్లు' దర్శకుడు రాజ్ కుమార్‌కు రూ.66 వేల ఆర్థిక సాయం

16-11-2019 Sat 11:21
  • ఆయన అనారోగ్యం వార్తలపై స్పందించిన సినీ జనం
  • రూ.41 వేలు అందించిన ప్రసాద్ క్రియేటివ్ స్కూల్ పార్టనర్ సురేష్ రెడ్డి
  • రూ.25 వేలు సేకరించి అందించిన కాదంబరి కిరణ్

ఈరోజు మెగాస్టార్ గా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్న చిరంజీవి లాంటి కథానాయకులకు తొలి అవకాశం ఇచ్చిన 'పురాది రాళ్లు' చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ కు సినీ వర్గాల నుంచి 66 వేల రూపాయల ఆర్థిక సాయం అందింది. అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడమే కాక, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న వార్త బయటకు రావడంతో ప్రసాద్ క్రియేటివ్ మెంటర్స్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్టనర్ సురేష్ రెడ్డి స్పందించారు. తార్నాకలో ఉన్న దర్శకుడి ఇంటికి వెళ్లి రూ.41 వేలు అందించారు.

అలాగే, 'మనం సైతం' తరపున నటుడు కాదంబరి కిరణ్ కుమార్ రూ.25 వేలు అందించారు. రాజ్ కుమార్ పరిస్థితి చూసిన కిరణ్ మనం కూడా సాయం చేద్దామని గ్రూపులో పెట్టిన అభ్యర్థనకు పలువురు నటులు, సినీ జర్నలిస్టులు, సాంకేతిక నిపుణులు స్పందించారు. వారందించిన మొత్తాన్ని కిరణ్‌ స్వయంగా వెళ్లి రాజ్‌కుమార్‌కు అందించారు. స్పందించిన ప్రతి ఒక్కరికీ రాజకుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.