Telangana: ముందు లబ్ధిదారుల జాబితా ఇవ్వండి.. ఆ తర్వాతే నిధుల విడుదల!: ‘డబుల్’ ఇళ్లపై తెలంగాణకు కేంద్రం షాక్

  • మొదటి విడతలో రూ.600 కోట్లు విడుదల
  • రెండు, మూడు విడతల్లో పైసా కూడా విదల్చని కేంద్రం
  • దిక్కుతోచని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం నిధుల విషయంలో కేంద్రం కొర్రీలు పెడుతోంది. ఈ పథకం కోసం కేంద్రం నుంచి రెండు, మూడు దశల కింద రావాల్సిన రూ.1800 కోట్లను విడుదల చేసేందుకు ససేమిరా అంటోంది. 8 నెలలుగా నిధుల కోసం అభ్యర్థిస్తున్నా ఇచ్చేది లేదంటోంది. లబ్ధిదారుల జాబితా ఇస్తేనే నిధులు ఇస్తామని కరాఖండీగా చెబుతోంది. డబుల్ బెడ్రూం ఇళ్లకు మొదటి విడతలో రూ.1200 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం రెండు, మూడు విడతల్లో మాత్రం నిధుల విడుదలకు అభ్యంతరాలు చెబుతోంది.

కేంద్రం వాదనను తెలంగాణ ప్రభుత్వం తప్పుబడుతోంది. నిర్మాణంలో ఉండగానే లబ్ధిదారులను ఎంపిక చేస్తే అది అనవసర సమస్యలకు దారి తీస్తుందని చెబుతోంది. లబ్ధిదారులను ముందుగానే ఎంపిక చేయడం వల్ల ఒత్తిళ్లు పెరగడంతోపాటు ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని వాదిస్తోంది.

నిజానికి ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటికి దాదాపు రూ. 9 లక్షలు ఖర్చవుతుండగా, కేంద్రం తన వంతుగా లక్షన్నర రూపాయలు ఇస్తోంది. ఈ లెక్కన జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న లక్ష ఇళ్లకు కేంద్రం నుంచి ఇంకా రూ.1500 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో మొదటి విడత కింద రూ.600 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం ఇంకా రూ.900 కోట్లతోపాటు ఇతర జిల్లాలో నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించి మరో రూ.900 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడీ నిధుల విడుదల విషయంలో కొర్రీలు పెడుతూ లబ్ధిదారుల జాబితాను తీసుకురమ్మని చెబుతోంది. ఆ జాబితా ఇస్తేనే నిధుల విడుదల గురించి ఆలోచిస్తామని తేల్చి చెప్పడంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

More Telugu News