GMR Infra: ఆదాయం పెరిగినా.. రూ.457.29 కోట్లు నష్టపోయిన జీఎంఆర్ ఇన్‌ఫ్రా

  • గతేడాదితో పోలిస్తే మరింతగా నష్టపోయిన జీఎంఆర్
  • రూ.1904.24 కోట్ల నుంచి రూ.2018.17 కోట్లకు పెరిగిన ఆదాయం
  • విద్యుత్ రంగంలో తగ్గిన ఆదాయం

జీఎంఆర్ ఇన్‌ఫ్రా‌స్ట్రక్చర్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.457.29 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. గతేడాది నష్టాలతో పోలిస్తే ఇది మరింత ఎక్కువ కావడం గమనార్హం. 2018-19 ఆర్థిక సంవత్సరంలోని ఇదే త్రైమాసికంలో రూ.334.36 కోట్ల నష్టాన్ని జీఎంఆర్ చవిచూసింది. అయితే, ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది. రూ.1904.24 కోట్లుగా ఉన్న ఆదాయం రూ.2018.17 కోట్లకు పెరిగినట్టు సంస్థ తెలిపింది.

విమానాశ్రయాల నుంచి ఆదాయం రూ.1315.5  కోట్ల నుంచి రూ.1494.7 కోట్లకు పెరిగినట్టు పేర్కొంది. ఫలితంగా లాభం రూ.135 కోట్లకు చేరినట్టు వివరించింది. హైదరాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ ఈసారి మూడు శాతం పెరిగి 54 లక్షలకు చేరుకోగా, ఢిల్లీలో మాత్రం విమాన ప్రయాణికుల రద్దీలో ఎటువంటి మార్పులేదు. హైదరాబాద్‌లో విమాన ప్రయాణికుల రద్దీ పెరగడం కారణంగా రూ.217 కోట్ల లాభం సమకూరినట్టు తెలిపింది. జీఎంఆర్ విద్యుత్ రంగం నుంచి వచ్చిన ఆదాయం మాత్రం రూ.178.2 కోట్ల నుంచి రూ.167.4 కోట్లకు తగ్గినట్టు జీఎంఆర్ వివరించింది.

More Telugu News