Andhra Pradesh: కేవలం పరిపాలనా అనుభవం లేకపోవడం వల్లే ఏపీలో ఇసుక కొరత: సబ్బం హరి

  • జగన్ అధికారంలోకి వచ్చిన నెల వరకూ నిర్ణయం తీసుకోలేదు
  • కొత్త జీవో ఇచ్చే వరకూ పాతపద్ధతిలోనే ఇసుక సరఫరా చేయాల్సింది
  •  ఇసుక కొరతతో ఆంధ్రప్రదేశ్ ఉక్కిరిబిక్కిరైంది

ఏపీలో నెలకొన్న ఇసుక కొరతపై సీనియర్ రాజకీయ నాయకుడు సబ్బం హరి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘టీవీ 5’లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేవలం పరిపాలనా అనుభవం లేకపోవడం వల్లే ఏపీలో ఇసుక కొరత తలెత్తిందనడంలో ఎలాంటి అనుమానం లేదని అన్నారు. ఎవరైతే ఇసుకను అక్రమంగా తరలిస్తారో వారికి కఠిన శిక్షలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించడం బాగానే ఉంది కానీ ఇంత వరకూ ఎవరికీ శిక్ష పడలేదని, ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. చంద్రబాబు హయాంలో ఉన్న ఇసుక ధర కన్నా ఇప్పుడు తక్కువ ధరకు లభిస్తేనే ప్రజలు విశ్వసిస్తారని అన్నారు.

జగన్ అధికారంలోకి వచ్చిన నెల వరకూ కొత్త ఇసుక విధానంపై నిర్ణయం తీసుకోకపోవడం, ఆ తర్వాత వరదలు రావడం, కొత్త జీవో ఇచ్చే వరకూ పాతపద్ధతిలోనే ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం చెప్పకపోవడం వల్ల ఇసుక కొరత వచ్చిందని భావించారు. ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా ఇసుక కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్ ఉక్కిరిబిక్కిరైందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమూ కేవలం రెండు, మూడు నెలల్లోనే ఇంత వ్యతిరేకత ఎదుర్కోవడం చూడలేదని చెప్పారు. ఇసుక వరకు అనుభవరాహిత్యంతో చేసిన నిర్ణయానికి ఏపీ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అన్నారు.

More Telugu News