cricket: ఏకంగా పదిమంది ఆటగాళ్లను వదిలించుకున్న ముంబయి ఇండియన్స్

  • ఐపీఎల్ తాజా సీజన్ కోసం డిసెంబరు 19న వేలం
  • ఆటగాళ్లను వదిలించుకోవడంలో ఫ్రాంచైజీలు బిజీ
  • యువరాజ్, లూయిస్, జోసెఫ్ లను రిలీజ్ చేసిన ముంబయి

ఐపీఎల్ వచ్చే సీజన్ కోసం వేలం ప్రక్రియ డిసెంబరు 19న జరగనున్న నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్లను వదిలించుకోవడం, ఇతర ఫ్రాంచైజీలతో పరస్పరం బదిలీ చేసుకోవడం వంటి చర్యలను వేగవంతం చేశాయి. అందరినీ ఆశ్చర్యపరుస్తూ గత సీజన్ విన్నర్ ముంబయి ఇండియన్స్ ఒక్కసారే 10 మంది ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసింది. వారిలో ఒకప్పటి డాషింగ్ ఆల్ రౌండర్ యువ్ రాజ్ సింగ్ కూడా ఉన్నాడు. అంతేకాదు, రూ.3.8 కోట్లు పెట్టి కొనుక్కున్న విండీస్ బ్యాట్స్ మన్ ఎవిన్ లూయిస్ కూడా ఈ జాబితాలో నిలిచాడు.

ఇక, ఐపీఎల్ లో తానాడిన తొలి మ్యాచ్ లోనే సంచలన స్పెల్ తో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన విండీస్ యువ పేసర్ అల్జారి జోసెఫ్ (6/12) ను కూడా ముంబయి ఇండియన్స్ జట్టు నుంచి రిలీజ్ చేసింది. వీరిద్దరే కాకుండా ఆడమ్ మిల్నే (న్యూజిలాండ్), జాసన్ బెహ్రెండార్ఫ్ (ఆస్ట్రేలియా), బ్యూరాన్ హెండ్రిక్స్ (దక్షిణాఫ్రికా), బెన్ కట్టింగ్ (ఆస్ట్రేలియా), బరిందర్ శ్రాన్ (పంజాబ్), రసిఖ్ సలామ్ (కశ్మీర్), పంకజ్ జైస్వాల్ (హిమాచల్ ప్రదేశ్) కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ పదిమందిని వదిలించుకున్న అనంతరం ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ వద్ద ఆటగాళ్ల కొనుగోలు కోసం రూ.13.05 కోట్లు మిగిలున్నాయి.

More Telugu News