Terrorists: ఉగ్రవాద నిర్మూలనపై పాక్ చిత్తశుద్ధి చాటాలి: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్

  • పాక్ మాటల్లో కాదు చేతల్లో చూపించాలి
  • ఉగ్రవాదాన్ని పెంచే ఒక దేశంతో ఏ దేశమూ చర్చలకు రాదు
  • జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి

ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని మాటల్లో కాదు చేతల్లో చూపించాలని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు ఆ దేశం చిత్తశుద్ధితో సహకరించాలని అప్పుడే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయన్నారు. లీ మోండే అనే ఫ్రెంచ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ మాట్లాడారు. భారత్, పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్నాయని పాక్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలపై  జైశంకర్ ఈ సందర్భంగా స్పందించారు.

‘పాకిస్థాన్ ఒక ఉగ్రవాద పరిశ్రమనే పెంచి పోషిస్తోంది. దీని ద్వారా భారత్ లోకి ఉగ్రవాదులను తరలిస్తూ దాడులకు పాల్పడుతోంది. దీన్ని పాక్ కూడా ఖండించదు. ఇప్పుడు నాకు చెప్పండి ? ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఇలాంటి ఒక దేశంతో ఏ దేశమైనా చర్చలు జరిపేందుకు ముందుకు వస్తుందా? ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు పాక్ సిద్ధంగా ఉందని మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చూపించాలి. అప్పుడే ప్రపంచం విశ్వసిస్తుంది’ అని జైశంకర్ అన్నారు.

అధికరణ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని.. త్వరలోనే విదేశీ పాత్రికేయులను కూడా అక్కడికి వెళ్లేందుకు అనుమతిస్తామని మంత్రి చెప్పారు.  అక్కడ విధించిన ఆంక్షల్లో కొన్నింటిని ఎత్తివేశామన్నారు. త్వరలో పరిస్థితులను సమీక్షించి పూర్తి ఆంక్షలను ఎత్తివేస్తామని తెలిపారు.

More Telugu News