Jagan: హోదాపై గట్టిగా మాట్లాడండి.... వైసీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్

  • ఈ నెల 18 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
  • ప్రస్తావించాల్సిన అంశాలపై ఎంపీలతో చర్చించిన జగన్
  • పోలవరం విషయంలోనూ ఒత్తిడి చేయాలని స్పష్టీకరణ

ఏపీ సీఎం జగన్ వైసీపీ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 18 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆయన తన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు.

ప్రత్యేక హోదా అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ ఆదేశించారని వెల్లడించారు. పోలవరానికి రావాల్సిన నిధులపై మంత్రితో చర్చించాలని, రామాయపట్నం పోర్టు, రెవెన్యూ లోటుపై గట్టిగా అడగాలని కూడా స్పష్టం చేసినట్టు వివరించారు. హోదా కోసం వైసీపీ ఎంపీలంతా కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మిథున్ రెడ్డి ఉద్ఘాటించారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. మరో ఎంపీ సత్యవతి మాట్లాడుతూ, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల గురించి లేవనెత్తుతామని తెలిపారు.

More Telugu News