టీడీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా ఎలా కొంటున్నారు?.. దేవుడి స్క్రిప్ట్ ఏమయ్యింది?: బుద్ధా వెంకన్న

15-11-2019 Fri 11:12
  • జగన్ గారు నీతులు వల్లించారు కదా?
  • ఇప్పుడు సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలను ఎలా కొంటున్నారు?
  • బాబుగారి దీక్షకి జనాలు రాలేదు అని అంటున్నారు కదా?
  • మరి మీ జగన్ గారు ఏంటి భయపడ్డారు? 

టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో తెలియట్లేదని, ఫ్లెక్సీలు, పోస్టర్లు, జెండాలు కట్టినంత మంది కూడా దొంగ దీక్షకు హాజరు కాలేదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ఇసుక దీక్షకు జనాలు రాకపోతే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

'నీతులు వల్లించిన జగన్ గారు సిగ్గు లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా ఎలా కొంటున్నారు? బాబుగారి దీక్షకి జనాలు రాలేదు అని అంటున్నారు కదా? మరి మీ జగన్ గారు ఏంటి భయపడ్డారు?' అని విమర్శించారు.

'దేవుడి స్క్రిప్ట్ ఏమయ్యింది విజయసాయి రెడ్డి గారు? 23 మందే గెలిచారు అని ఎద్దేవా చేసిన మీ జగన్ గారు ఇప్పుడు ఎందుకు తడుపుకుంటున్నారు? టీడీపీ పేరు వింటే వణుకు పుడుతుందా? చంద్రబాబు గారిని చూసి నిద్రపట్టడం లేదా?' అని బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో ప్రశ్నించారు.

కాగా, తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను గతంలో చంద్రబాబు లాక్కున్నారని, ఇప్పుడు అందుకే ఆయనకు 23 సీట్లే వచ్చాయని, అది దేవుడి స్క్రిప్ట్ అని జగన్‌ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.