Chandrababu: ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసనే పోలేదు, అప్పుడే చంద్రబాబు దీక్షలా?: వల్లభనేని వంశీ

  • ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలి
  • ఆ పని చంద్రబాబు చేయలేదు
  • ప్రతిపక్ష నాయకుడి పాత్రనూ ఆయన పోషించలేకపోతున్నారు

ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదని, అప్పుడే చంద్రబాబునాయుడు దీక్షలు చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2014 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము కూడా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని హామీలు ఇచ్చామని అన్నారు. తాము  అధికారంలోకి  వచ్చిన తర్వాత ఎంతకాలం తర్వాత రైతు రుణమాఫీ మొదలుపెట్టామో, ఎన్ని దశలుగా చేశామో, ఎప్పటి వరకు చేశామో ప్రజలందరికీ తెలుసని అన్నారు. అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీ గురించీ అందరికీ తెలుసని చెప్పారు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలని, ఆ పని చంద్రబాబు చేయలేదని, అందుకే, ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా ఆయన పోషించలేకపోతున్నారని విమర్శించారు.

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నదుల్లో ఇసుకను మనం తీయగలమా? వర్షాలు, వరదలు ఉన్న సమయంలో ఇసుకను బయటకు తీసే సాంకేతిక టెక్నాలజీ మన దగ్గర ఉందా? చంద్రబాబు సెల్ ఫోన్, కంప్యూటర్.. కనిపెట్టారని తమ మిత్రులందరూ చెబుతుంటారు కనుక, ఇలాంటి టెక్నాలజీని కూడా కనిపెట్టే శక్తిని భగవంతుడు ఆయనకు ఇవ్వాలని కోరుకుంటున్నానని సెటైర్లు విసిరారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మంచిపని చేసినప్పుడు సమర్థించాలని, అదే, మంచిపని కాకపోతే విమర్శించాలని సూచించారు.

More Telugu News