Rahul Gandhi: రాఫెల్ వివాదంపై విచారణకు సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ తలుపులు తెరిచే ఉంచారు: రాహుల్ గాంధీ

  • కోర్టు తీర్పుతో దారులు మూసుకుపోలేదు
  • త్వరలోనే విచారణ ప్రారంభమవుతుందని విశ్వసిస్తున్నా
  • జేపీసీ కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలి

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికి.. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఈ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని నియమిస్తుందని ఆశిస్తున్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో సందేశాన్ని పోస్ట్ చేశారు.

 'సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ దీనిపై విచారణ జరపడానికి తలుపులు  తెరిచే ఉంచారు. పూర్తి స్థాయిలో విచారణ మొదలవ్వాలి. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి జేపీసీని కూడా తప్పకుండా నియమించాల్సి ఉంటుంది’ అని అన్నారు.

ఈ రోజు ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్ కె కౌల్, జస్టిస్ కెఎం జోసెఫ్ లతో కూడిన ధర్మాసనం రాఫెల్ పై దాఖలైన సమీక్ష పిటిషన్లను కొట్టివేసింది. గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరంలేదని తెలిపింది. మోదీ ప్రభుత్వం నిబంధనల ప్రకారమే ఒప్పందం కుదుర్చుకుందని కోర్టు అభిప్రాయపడింది.

మరోవైపు కోర్టు ధిక్కరణ కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ వివాదంలో  మోదీ నుద్దేశించి చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్ వ్యాఖ్యలు గతంలో చేశారు. దీనిపై బీజేపీ నేత మీనాక్షి కోర్టు ధిక్కరణ కేసు వేశారు. ఇప్పటికే దీనిపై రాహుల్ కోర్టుకు బేషరతుగా క్షమాపణలు కోరుతూ అఫిడవిట్ సమర్పించారు. ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ. రాహుల్ ఇకముందు వ్యాఖ్యలు చేసేటప్పుడు అప్రమత్తతో ఉండాలని సూచించింది.

More Telugu News