Sabarimala: శబరిమలపై ఎటూ తేల్చని సుప్రీం... ప్రస్తుతానికి మహిళలకు అనుమతి!

  • మహిళల ప్రవేశంపై గత తీర్పును సవరించలేము
  • పిటిషన్లను విస్తృత ధర్మాసనం విచారిస్తుంది
  • సుప్రీం తీర్పుతో శబరిమలకు మరిన్ని బలగాలు
  • ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న కేరళ సర్కారు

కేరళలోని పశ్చిమ కనుమల్లో కొలువైన శబరి గిరీశుని ఆలయంలోకి మహిళల ప్రవేశం గురించి దాఖలైన పిటిషన్లపై విచారించిన ధర్మాసనం, కేసును ఎటూ తేల్చకుండా,  నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం అవసరమని భావిస్తూ, కేసును ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేసింది. మహిళలకు ప్రవేశాన్ని కల్పించాల్సిందేనని, గత సంవత్సరం తామిచ్చిన తీర్పును సవరించేందుకుగానీ, రద్దు చేసేందుకు గానీ ప్రస్తుతం ఈ ధర్మాసనానికి హక్కు లేదని, ఈ విషయంలో విస్తృత ధర్మాసనమే మరింత లోతుగా విచారించి నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించింది.

ఈ కేసు తీర్పు సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నో దేవాలయాల్లో పురుషులకు ప్రవేశం లేదని గుర్తు చేస్తూ, ఇప్పటికి కూడా మసీదుల్లో మహిళలకు ప్రవేశం లేదని పేర్కొంది. సమానత్వం గురించిన వాదనే వస్తే, తమకు వచ్చిన అన్ని పిటిషన్లనూ విచారించాల్సి వుందని అభిప్రాయపడింది. ఇంత తక్కువ సమయంలో పిటిషన్లను అన్నింటినీ విచారించలేకపోయామని తెలిపింది. భవిష్యత్తులో వీటిని విచారించే ధర్మాసనం, సరైన తీర్పును వెలువరిస్తుందని భావిస్తున్నట్టు పేర్కొంది.

కాగా, ప్రస్తుతానికి శబరిమల ఆలయానికి మహిళలకు ప్రవేశంపై ఎటువంటి నిషేధమూ లేదని సుప్రీంకోర్టు ప్రకటించగానే, అయ్యప్ప సన్నిధికి అదనపు బలగాలను పంపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత సంవత్సరం మాదిరిగానే, ఔత్సాహికులైన మహిళలు ఎవరైనా ఆలయానికి రావాలని ప్రయత్నిస్తే, భక్తులు అడ్డుకుంటారని, తత్ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవచ్చని భావిస్తున్న ట్రావెన్ కోర్ దేవస్థానం, ఈ మేరకు ప్రభుత్వానికి అదనపు బలగాల కోసం విన్నవించింది.

మరో రెండు రోజుల్లో ఆలయం తలుపులు మండల పూజ కోసం 40 రోజుల పాటు, ఆపై ఐదు రోజుల తరువాత మకర విలక్కు కోసం తెరచుకోనుండగా, పథనం తిట్ట పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. నీలక్కల్ నుంచి పంబకు దారితీసే మార్గాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. పరిస్థితిని బట్టి వాహనాలకు అనుమతి ఉంటుందని, భక్తులు సహకరించాలని అధికారులు కోరారు.

More Telugu News