Supreme Court: రాహుల్ గాంధీకి ఊరట.. పరువు నష్టం దావా కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు!

  • రాహుల్ పై పరువు నష్టం, కోర్టు ధిక్కరణ పిటిషన్లు
  • రాహుల్ గాంధీ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
  • భవిష్యత్ లో సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై (కాపలాదారుడే దొంగ) అంటూ చేసిన విమర్శలపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ, పరువు నష్టం దావా పిటిషన్ లు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రాహుల్ గాంధీపై దాఖలైన ఈ పిటిషన్లను కొట్టేసింది.

అయితే, రాహుల్ గాంధీ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. భవిష్యత్ లో సంయమనం పాటించాలని ఆయనను సుప్రీంకోర్టు ఆదేశించింది. పిటిషన్ లు కొట్టి వేయడంతో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. కాగా, 2019 లోక్ సభ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాల్లో పదే పదే 'కాపలాదారుడే దొంగ' అంటూ వ్యాఖ్యానించారు.

బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే తాను దేశ ప్రధానిగా కాకుండా దేశ కాపలాదారుడిగా ఉంటానని 2014 లోక్ సభ ఎన్నికల ముందు మోదీ అన్నారు. ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్ ఇటువంటి విమర్శలు చేశారు. రఫేల్, పెద్దనోట్ల రద్దు వంటి అంశాలను ఉద్దేశిస్తూ 'కాపలాదారుడే దొంగ' అంటూ వ్యాఖ్యానించడమే కాకుండా, ఈ వ్యాఖ్యలను ప్రధానిపై సుప్రీంకోర్టే చేసిందంటూ వాటిని న్యాయస్థానానికి ఆపాదించారు.

More Telugu News